Online Puja Services

నాయనార్ల గాథలు - అప్పుడి నాయనారు

18.118.227.69

నాయనార్ల గాథలు - అప్పుడి నాయనారు | Nayanar Stories - Appudi Nayanar
లక్ష్మీ రమణ .  

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తి చెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. నాయనార్లలో అప్పారు అటువంటి భాగ్యాన్ని పొందిన ధన్య జీవి.  ఆయన సోదరి తిలకావతి అప్పారు జీవితాన్ని గొప్ప మలుపు తిప్పారు.  అయితే అప్పారుకి ఏకలవ్య శిష్యుడై , అనంతరం ఆయన అనుగ్రహం పొంది శివసాయుజ్యాన్ని చేరుకున్న నాయనారు ఉన్నారు.  ఆయనే అప్పుడి నాయనారు. 

అప్పుడి నాయనారు చోళ రాజ్యంలోని తింగలూరు వాస్తవ్యుడు.  సంపన్నమైన బ్రాహ్మణ కుంటుంబీకుడు. ధర్మ నిరతుడు. శివపూజా దురంధరుడు. ఈయన నిజంగా అప్పారుకి ఏకలవ్య శిష్యుడే ! అప్పారుని ఈశ్వరుడు అనుగ్రహించి వాగీశుడు అనే బిరుదివ్వడం, ఆ తర్వాత ఆయన ఈశ్వరుడే తోడుగా జైనులు,పల్లవ రాజులు పెట్టిన కఠినమైన పరీక్షలన్నీ తట్టుకొని శైవధర్మం ఔన్నత్యాన్ని చాటడం వంటి సంఘటలు విని అప్పుడి నాయనారు, అప్పారుని తన గురువుగా స్వీకరించారు .  

నిరంతర గురుధ్యానం, అనితర సాధ్యమైన నమ్మకం ఉంటె ఆ గురువు అనుగ్రహం ఈశ్వరుని సాక్షిగా అటువంటి శిష్యునికి లభించి తీరుతుంది .  ఈశ్వరుడే ఆ గురుశిష్యులు ప్రత్యక్షంగా కలిసేందుకు కారణ మవుతారనడంలో సందేహంలేదు. అప్పుడి నాయనారు, వాగీశుడైన అప్పారుని  అప్పటికి  ఇంకా కలవనే లేదు. కానీ నిరంతరం అప్పారుపైన అమితమైన గౌరవం, భక్తి ఉండేవి అప్పుడి నాయనారుకి. ఎప్పుడూ వాగీశుని ప్రత్యక్షంగా కలవకపోయినా, ఆ ఈశ్వర స్వరూపంగానే భావించి , ఈశ్వరునిలోనే వాగీశుని అర్చించేవారు అప్పుడి నాయనారు. పైగా, తానూ కట్టించిన ధర్మ శాలలకి, సత్రాలకి, తవ్వించిన బావులకీ వాగీశుని ధర్మము అను గురువుగారి పేరు పెట్టారు . తనకి ఈశ్వరుడు ప్రసాదించిన పుత్రులకి పెద్దవాగీశుడు, చిన్న వాగీశుడు అని పేర్లు పెట్టుకున్నారు.  

ఒకనాడు వాగీశుడు (అప్పారు నాయనారు) తన యాత్రా స్రవంతిలో భాగంగా తింగలూరు మీదుగా ప్రయాణం చేస్తున్నారు. దారిలో సత్రములపైనా , బావులపైన తన పేరు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కట్టించి, ఈశ్వరుని భక్తులకి ఇంతటి సేవని అందజేస్తున్న మహానుభావులు ఎవరా అని ఆరాతీశారు! అందరూ అప్పుడి నాయనారు గురించి చెప్పారు.  ఆ మహా భక్తుణ్ణి కలుసుకోవాలని ఉవ్విళ్లూరుతూ వాగీశుడు అప్పుడి నాయనారు ఇంటికి ఒక తీర్థయాత్రీకునిగా వెళ్లారు.  

నుదుటన త్రిపుండ్రాలతో, మెడలో రుద్రాక్షరలు ధరించి , శిరస్సున శిఖతో మరో శివునిలా ప్రకాశిస్తున్న వాగీశుని చూడగానే, సాదరంగా ఆహ్వానించారు అప్పుడి నాయనారు దంపతులు. వారి ఇంట భోజనం చేసి, వారి ఆతిధ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు.  సరేనన్నారు వాగీశులు.  “అయితే, అలా విశ్రమించండి.  వంట కాగానే వడ్డించేస్తానంటూ వినమ్రంగా విన్నవించి, వంటింట్లోకి వెళ్ళింది ఆ ఇల్లాలు. 

అప్పుడు వాగీశులు తన మదిలోని సందేహాన్ని అప్పుడి నాయనారుని అడిగారు.  “ అయ్యా ! మీ గురించి దారిపొడవునా ఎంతో గొప్పగా విన్నాను.  మీ ఔదార్యాన్ని ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను.  ఇంతటి ధర్మాత్ములైన మీరు , మీరు చేసిన కార్యక్రమాలకి ఒక అనామకుని పేరుని శిలా ఫలకంపైన వేయించారెందుకు? మీ పేరుని వేయించవలసినది కదా !” అన్నారు .  అనామకుడు అని తన గురువుని అన్నందుకు, ఆ మాట తన చెవిన పడినందుకే విలవిలలాడా గురుభక్తుడు. “ అయ్యా ! తమరెవరో తెలియదుగానీ,  ఈశ్వరుని చిహ్నాలతో కనిపిస్తున్నారు కనుక క్షమించి మాట్లాడుతున్నాను. వాగీశులు మహా శివభక్తులు . శివ ధర్మాన్ని తిరిగి నిలబెట్టిన పరమపురుషులు.  సాక్షాత్ శివ స్వరూపులు.  ఈశ్వరుడు తనని నిందించినా భరిస్తారు గానీ, తన భక్తులని నిందిస్తే , క్షమించరు.  మహా మహిమాన్వితులైన వాగీశుని గురించి తెలియని మీరు ఎవరు? ఏ ప్రాంతం నుండీ వచ్చారు ?” అని అడిగారు. 

అప్పుడు అప్పారు, “ అయ్యా! నేను ఒకప్పుడు తప్పుడు దారిలో వెళ్లి ఈశ్వరునికి ద్రోహం చేశాను.  తిరిగి ఈశ్వరుని కృపతో ఆయన అనుగ్రహాన్ని పొందాను.  తల్లి దండ్రులు నాకు పెట్టిన పేరు మరుల్ నీకియారు” అని వినమ్రంగా చెప్పారు.  ఈ ఉదంతాన్ని ఎప్పుడైతే అప్పుడి నాయనారు విన్నారో, వెంటనే వచ్చింది ఎవరో గ్రహించేశారు.  తన దైవమే  తన ఎదుట సాక్షాత్కరించిందని ఆత్మానంద పరవశుడయ్యారు. కనుల నుండీ ఆనందభాష్పాలు కురుస్తుండగా , గొంతు గాద్గిగమై గురుపాదాలకు ప్రణమిల్లారు.  విషయం తెలుసుకున్న ఆయన ఇల్లాలు అప్పారుకి నమస్సులు అర్పించారు. భక్తితో ఆ దంపతులు ఆయనకీ పాదపూజ చేశారు.  ఆ భక్తి తత్పరతకు వాగీశులు నిజంగానే నిలువెల్లా పులకరించిపోయారు. 

గురుశిష్యులు ఒకరి సాంగత్యంలో మరొకరు పరవశిస్తూండగా, అప్పుడి నాయనారు ఇల్లాలు భోజనాలు సిద్ధం చేశారు.  వడ్డించేందుకు అరిటాకులు తీసుకురమ్మని ఆమె పెద్దకొడుకుకైన పెద్దవాగీశునికి పురమాయించారు.  అతను తోటలోకి వెళ్లి అరిటాకులు కోస్తుండగా, అక్కడే పొంచిఉన్న విషసర్పం కాటు వేశింది. అతను తల్లికి ఆ ఆకులు అందించి, జరిగిన విషయం చెప్పి మరణించాడు.  ఆ తల్లి అంతటి దుఃఖాన్ని గుండెలో దాచేసింది.  గురువుగారికి భోజనం ఇబ్బంది కాకూడదు, ఆయన అభోజనంగా ఉండకూడదు అని తలపోసింది.  విషయాన్ని దయచేసి, భోజనాలు వడ్డించింది. 

వాగీశులు (అప్పారు) విషయాన్ని తమ దివ్య దృష్టితో తెలుసుకున్నారు.  అయినా ఏమీ తెలియనట్టు, “ అమ్మా ! మీ పెద్ద కొడుకుని పిలవండి” అన్నారు.  తండ్రిలా అప్పారు ఆ మాట అడగగానే ఆ తల్లి హృదయం భళ్ళున బద్దలయ్యింది. భోరున విలపిస్తూ, జరిగిన విషయాన్ని చెప్పింది.  అప్పారు, తన చేతితో చిటికెడు విభూతిని ఇచ్చి అది ఆ పిల్లవాడి శరీరానికి పెట్టి,  ఆ దేహాన్ని శివాలయం వద్దకి తీసుకురమ్మన్నారు.  

ఆలయానికి చేరుకున్న అప్పారు ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ, ఆ పిల్లవాడికి జీవాన్నిమ్మని అర్థిస్తూ, అద్భుతమైన గానం చేశారు.  అంతే, నిదుర నుండీ మేల్కొన్నట్టు, ఆ పిల్లవాడు తిరిగి ప్రాణం పోసుకొని లేచాడు. ఆ విధంగా గురువుగారు తమ పట్ల చూపిన కృపకి సంతోషించినా, ఆయన భోజనం వేళ తప్పినందుకు వగచారు ఆ పుణ్యదంపతులు. అనంతరం ఇంటికి వెళ్లి అందరూ కలిసి భోజనం చేశారు. ఆ విధంగా అప్పారు, అప్పుడి నాయనారు దగ్గర కొంతకాలం ఉండి, ఆ తర్వాత తన యాత్రని కొనసాగించారు.   

తన గురించి శిష్యుడు ఎంత గొప్పగా చెప్పినా , తానూ కేవలం శివుని సేవకుణ్ణి మాత్రమే అని చెప్పుకునే, అలా భావించే నిరాడంబరమైన గురువు. గురువే సర్వస్వము అని, ఆయన సర్వోన్నతుడని,  గురు సాంగత్యం సాక్షాత్తూ ఆ ఈశ్వరుని సాంగత్యమే అని పరవశించే శిష్యుడు.  ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన అనుబంధం కదూ ! ఆ విధంగా గురు సాంగత్యాన్ని, అనుగ్రహాన్ని పొందిన అప్పుడి నాయనారు చివరికి శివసాయుద్యాన్ని పొందగలిగారు. విశ్వ గురువైన ఆ దక్షిణామూర్తి, దయతో ఈ దివ్య ఉదంతాన్ని చదివిన, విన్న భక్తులకి తన అనుగ్రహాన్ని అందించగలరని ప్రార్ధిస్తూ,

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు.  శుభం .   

 

 

 

Nayanar, Stories, Appudi, Apputhi, Adigal, Appudhi, Adikal, 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi